తెలుగు వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు

తెలుగు వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు
ఉగాది - భావం
హైందవశాస్త్రం ప్రకారం అరవై తెలుగు నామసంవత్సరాలు ఉన్నాయి, అవి ఒక క్రమంగా వస్తాయి.
బ్రహ్మదేవుడు తన సృష్టిని చైత్ర శుద్ధ పాడ్యమి
రోజున ప్రారంభించాడు. ఆ రోజు యుగమునకు ఆది - యుగాది, నేటి ఉగాది. భారతీయ
గణితవేత్త శ్రీ భాస్కరాచార్యులవారి గణనం ప్రకారం ఈ రోజున సూర్యోదయ కాలానికి
కొత్త సంవత్సరం, కొత్త నెల, కొత్త రోజు వస్తాయి. వసంత ఋతువు మొదలవుతుంది.
అంత వరకూ బీడు పడి ఉన్న భూమి మొలకలు ఎత్తి, కొత్త జీవితానికి నాందిలా
పచ్చదనాన్ని సంతరించుకుంటుంది. పచ్చని పంటపొలాలు, ఏపైన చెట్లు, రంగు రంగుల
పూలు సౌభాగ్యానికి చిహ్నంగా కనబడతాయి.
ఇది తెలుగు వారి కొత్త సంవత్సరాది.
ఉగాది పచ్చడి - ప్రాముఖ్యత:
ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి.
షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక.
జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే అర్ధవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది
.
పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతీక -
బెల్లం - తీపి - ఆనందానికి సంకేతం
ఉప్పు - జీవితంలో ఉత్సాహమ, రుచికి సంకేతం
వేప పువ్వు – చేదు -బాధకలిగించే అనుభవాలు
చింతపండు - పులుపు - నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు
పచ్చి మామిడి ముక్కలు - పులుపు - కొత్త సవాళ్లు
మిరపపొడి – కారం - సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు
ప్రొద్దునే ఇంటి ఆడవారు పచ్చడి తయారు చేసి
దేవునికి నైవేద్యంగా పెడతారు. ఇంట్లోవారంతా స్నానం చేసి, కొత్త బట్టలు
కట్టుకొని పరగడుపున ఉగాది పచ్చడి తిని తర్వాత అల్పాహారం తీసుకుంటారు. ఆ
రకంగా తమ జీవితాలు అన్ని అన్నిభావాల మిశ్రమంగా ఉండాలని ఆకాంక్షిస్తారు.
పండగ తయారి:
ఒక వారం ముందే పండగ పనులు మొదలవుతాయి. ఇంటికి
వెల్ల వేసి, శుభ్రం చేసుకుంటారు. కొత్త బట్టలు, కొత్త సామాగ్రీ కొనడంలో
ఉత్సాహం పండుగ సందడి ఒక వారం ముందేమొదలవుతుంది. పండుగ రోజున
తెల్లవారుఝామునే లేచి, తలస్నానం చేసి, ఇంటికి మామిడి తోరణాలు కడతారు.
పచ్చటి మామిడి తోరనాలకు ఈ రోజుకు సంబంధించి ఒక కధ ఉంది. శివపుత్రులు గణపతి,
సుబ్రమణ్యస్వాములకు మామిడి పండ్లంటే ఎంతో ప్రీతి. సుబ్రహ్మణ్యుడు ఏ
ఇంటికి పచ్చని మామిడి తోరణాలు కట్టి ఉంటాయో ఆ ఇంటిలో సంపద, మంచి పంట
కలుగుతుందని దీవించాడని కధ.
ప్రతీ ఇంట ముందు ఆవు పేడతో కల్లాపి జల్లి ,
రంగు రంగుల రంగవల్లులు తీర్చి దిద్దుతారు. శాస్త్రయుక్తంగా తమ ఇష్టదైవానికి
పూజ చేసుకుని కొత్త సంవత్సరం అంత శుభం కలగాలనికోరుకుంటారు. ఆరోగ్య
ఐశ్వర్యాలను ఆకాంక్షిస్తారు . ఈ రోజున కొత్త పనులు వ్యాపారాలు మొదలెడతారు.
ఇంటింట ప్రత్యేక వంటకాలు తయారు చేస్తారు. పులిహోర, బొబ్బట్లు, పాయసం, అలాగే పచ్చి మామిడి కాయతో వంటకాలు విశేషం.
పంచాంగ శ్రవణం:
ఈ రోజున ప్రత్యేకంగా పంచాంగ శ్రవణం జరుగుతుంది. సాధారణంగా సాయంత్ర సమయాన
ఊరి జనాలు ఒక చోట చేరి, సిద్ధాంతి చెప్పే పంచాంగ వివరాలు, ఆ సంవత్సరరాశి
ఫలాలు తెలుసుకుంటారు సిద్ధాంతి దేశ, రాష్ట్ర, వ్యక్తీ స్థితి గతులు ఎలా
ఉంటాయో వివరణ చేస్తాడు. పంచాంగ శ్రవణం వాళ్ళ రానున్న మంచి చెడులను సమభావంతో
స్వీకరించ గలరని, పంచాంగ శ్రవణం వినడం మంచిది అని మన పెద్దలు చెప్పటం
జరిగింది.
కవి సమ్మేళనం:
ఉగాదికి సాహితీవేత్తలు ప్రత్యేకంగా "కవి
సమ్మేళనం" నిర్వహిస్తారు. కొత్త, పాత కవులు నవభావన, పాత ఓరవళ్ళు కలిపి
కొత్త పద్యాలు, కవితలు తయారు చేసి చదువుతారు. సామాజిక జీవనం, రాజకీయం,
వాణిజ్యం ఇలా అన్నివిషయాలను గూర్చి ప్రస్తావిస్తారు, కవులు తమకవితలలో. ఈ
విధంగా నానా రుచి సమ్మేళనంగా జరుగుతుంది ఉగాది కవి సమ్మేళనం.
ఊరగాయల కాలం:
మామిడికాయలు దండిగా రావడంతో స్త్రీలు ఊరగాయలు
పెట్టడం మొదలెడతారు. వర్షాకాలం, చలికాలానికి ఉపయోగించు కోవడానికి వీలుగా
మామిళ్ళను, ఇతర కాయలను ఎండబెట్టి, ఊరవేస్తారు. తెలుగు వారిళ్ళలో
ప్రత్యేకంగా చెప్పుకోవలసినది "ఆవకాయ".
“ఇలా వివిధ విశేషాలకు నాంది యుగాది - తెలుగువారి ఉగాది”
మరియు
ఉగాది
ఉగస్య ఆది ఉగాది:-"ఉగ" అనగా నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి 'ఆది'
'ఉగాది' అంటే సృష్టి ఆరంభమైన దినమే "ఉగాది". 'యుగము' అనగా ద్వయము లేక జంట
అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం 'యుగం'
(సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది. యుగాది
శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది.
తత్రచైత్రశుక్ల ప్రతిపదిసంవత్సరారంభ:- చైత్రశుద్ధ పాడ్యమి నాడు సంవత్సరాది 'ఉగాది'గా ఆచరణీయమని నిర్ణయసింధుకారుడు పేర్కొనియున్నాడు.
ఉగాది పుట్టుపూర్వోత్తరాలు
వేదాలను హరించిన సోమకుని వధించి మత్యావతారధారియైన
విష్ణువు వేదాలను బ్రహ్మకప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు
ప్రీత్యర్ధం 'ఉగాది' ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి.
చైత్రశుక్లపాడ్యమినాడు విశాలవిశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించెను. కనుక
సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపబడుచున్నదని కూడా చెప్పబడుచున్నది.
శాలివాహన చక్రవర్తి చైత్రశుక్లపాడ్యమినాడే పట్టాభిషిక్తుడై తన
శౌర్యపరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా భాసిల్లిన కారణాన ఆ యోధాగ్రని
స్మృత్యర్థం ఉగాది ఆచరింపబడుతున్నదని చారిత్రక వృత్తాంతం. ఏది ఏమైనా
జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగుల్కొల్పి మానవాళిలో నూతనాశయాలను
అంకురింపచేసే శుభదినం 'ఉగాది'.
"ఉగాది" ఆచరణ విధానం
ఉగాది పర్వాచరణ విధానాన్ని 'ధర్మసింధు' కారుడు 'పంచవిధుల సమన్వితం'గా ఇలా సూచించియున్నాడు.
తైలాభ్యంగం సంకల్పాదవు నూతన వత్సర నామకీర్త నాద్యారంభం...
ప్రతిగృహం ధ్వజారోహణం, నింబపత్రాశనం వత్సరాది ఫలశ్రవణం...
ఉగాది రోజు
- తైలాభ్యంగనం
- నూతన సంవత్సరాది స్తోత్రం
- నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం)
- ధ్వజారోహణం (పూర్ణకుంభదానం)
- పంచాంగ శ్రవణం
మున్నగు 'పంచకృత్య నిర్వహణ' గావించవలెనని వ్రతగంధ నిర్దేశితం.
తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనెతో తలంటి పోసుకోవడం
ప్రధమ విధి. ఉగాది వంటి శుభదినాలలో సూర్యోదయానికి పూర్వమే మహాలక్ష్మి
నూనెలోను, గంగాదేవి నీటిలోను, ఆవహించి వుండునని ఆర్యోక్తి. కావున నూనెతో
తలంటుకుని అభ్యంగన స్నానం చేసిన లక్ష్మి, గంగా దేవుల అనుగ్రహాన్ని
పొందగలుగుతారు. "అభ్యంగంకారయోన్నిత్యం సర్వేష్వంగేషు పుష్ఠినం" (అభ్యంగన
స్నానం అన్ని అవయవాలౌ పుష్టిదాయకం) అని ఆయుర్వేదోక్తి దృష్ట్యాఅభ్యంగనం
ఆరోగ్యం కూడా. ఆరోగ్యరీత్యా ఆధ్యాత్మికరీత్యా తైలభ్యంగనానికీ రీతిగా విశేష
ప్రాధాన్యమీయబడినది.
అభ్యంగ స్నానానంతరం సూర్యునికి, ఆర్ఘ్యదీపధూపాధి,
పుణ్యకాలానుష్టానం ఆచరించిన పిదప మామిడి ఆకులతోరణాలతో, పూలతోరణాలతో దేవుని
గదిలో మంటపాన్ని నిర్మించి, అందు నూతన సంవత్సర పంచాంగాన్ని, సంవత్సరాది
దేవతను, ఇష్టదేవతారాధనతో బాటు పూజించి ఉగాది రసాయనాన్ని (ఉగాది పచ్చడి)
నివేదించవలెను.
ఉగాది నాటి ఆచారాలలో ఉగాది పచ్చడి సేపనం అత్యంత
ప్రధానమైనది. వేపపూత, కొత్త చింతపండు, బెల్లం లేక పంచదార లేక చెరకు
ముక్కలు, నేయి, ఉప్పు, మిరియాలు, షడ్రుచులు మిళితమైన రసాయనాన్నే ఉగాడి
పచ్చడి అంటాం!
అబ్దాదౌ నింబకుసుమం శర్కరామ్ల ఘృతైర్యుతమ్
భక్షితం పూర్వయామేతు తద్వర్షే సౌఖ్య దాయకమ్
అని ధర్మ సింధుగ్రంధం చెబుతున్నది. ఈ ఉగాడి
పచ్చడిని ఇంట్లో అందరూ పరగడుపున సేవించవలెను. ఉగాడి నాడు ఉగాడి పచ్చడి
సేవించడం వల్ల సంవత్సరమంతా సౌఖ్యదాయకమని ఈ శ్లోక భావం, పలురుచుల మేళవింపు
అయిన ఉగాడి పచ్చడి కేవలం రుచికరమే కాదు ప్రభోదాత్మకం కూడా! "తీపి వెనుక
చేదు, పులుపూ ఇలా పలురుచులకు జీవితాన కష్టాలు, తదితర అనుభూతులు, ప్రతీకలే
అనే నగ్న సత్యాన్ని చాటుతూ సుఖాలకు పొంగకు, దు:ఖానికి క్రుంగకు,
సుఖదు:ఖాలను సమభావంతో స్వీకరించు" అనే ప్రగతిశీల సందేశాన్నిస్తుందీ ఉగాది
పచ్చడి. అంతేగాక ఈ పచ్చడి సేవన ఫలంగా వివిధ అనారోగ్య స్థితులు పరిహరించబడి,
రోగశాంతి, ఆరోగ్యపుష్టి చేకూరుట గమనార్హం.
ఉగాదినాడు ఇంద్రధ్వజ, బ్రహ్మధ్వజ ప్రతిష్టపన
ఆచారంగా ఉన్నది. ఒక పట్టు వస్త్రాన్ని ఒక వెదురు గడకు పతాకం వలె కట్టి
దానిపై నారికేళముంచబడిన కలశాన్ని వుంచి, ఆ కర్రకు మామిడి ఆకులు, నింబ
పత్రాలు, పూల తోరణాలు కట్టి ఇంటి ప్రాంగణంలో ప్రతిష్టించి ఆరాధించడం
ధ్వజావరోహణం. ఇటీవల ఈ ఆచారం చాలావరకు కనుమరుగై దాని స్థానంలో కలశ స్థాపన,
పూర్ణకుంభదానం ఆచరణలోకి వచ్చింది.
ఏష ధర్మఘటోదత్తో బ్రహ్మ విష్ణు శివాత్మక:
అస్య ప్రదవాత్సకలం మమ: సంతు మనోరధా:
యధాశక్తి రాగి, వెండి, పంచలోహం లేదా మట్టితో
చేసిన కొత్తకుండను కలశంలా చేసి రంగులతో అలంకరించి అందులో పంచపల్లవాలు
(మామిడి, అశోక, నేరేడు, మోదుగ మరియు వేప చిగుళ్ళు) సుగంధ చందనం కలిపి
పుష్పాక్షతలు వేసి ఆవాహనం చేసి, పూజించి కలశానికి ఒక నూతన వస్త్రాన్ని
చుట్టి కలశంపై పసుపు కుంకుమ చందనం, పసుపు దారాలతో అలంకరించిన కొబ్బరి
బోండాం నుంచి పూజించి పురోహితునకుగాని, గురుతుల్యులకుగానీ,
పూర్ణకుంభదానమిచ్చి వారి ఆశీస్సులు పొందడం వల్ల సంవత్సరం పొడవునా విశేష
ఫలితం లభిస్తుందని ప్రతీతి.
"తిధిర్వారంచనక్షత్రం యోగ: కరణమేవచ పంచాంగమ్"
తిధి, వార, నక్షత్ర, యోగ, కరణములనెడి పంచ అంగాల
సమన్వితం పంచాంగం. ఉగాది నాడు దేవాలయంలోగాని, గ్రామకూడలి ప్రదేశాల్లోగాని,
పండితుల, సిద్థాంతుల సమక్షంలో కందాయఫలాలు స్థూలంగా తెలుసుకొని తదనుగుణంగా
సంవత్సరం పొడవునా నడచుకొనుటకు నాడే అంకురార్పణం గావించవలెనని
చెప్పబడియున్నది.
"పంచాంగస్యఫలం శృణ్వన్ గంగాస్నానఫలంఖిలేత్"
ఉగాదినాటి పంచాంగ శ్రవణం వల్ల గంగానదిలో స్నానం చేస్తే అభించేటంత ఫలితం లభిస్తుంది.
"సూర్యశ్శౌర్య మధేందురింద్రపదవీం" అనెడి పంచాంగ శ్రవణ ఫలశృతి
శ్లోకంలో ఉగాదినాడు పంచాంగ శ్రవణం చేసేవారికి సూర్యుడు శౌర్యాన్ని,
చంద్రుడు ఇంద్రసమాన వైభవాన్ని, కుజుడు శుభాన్ని, శని ఐశ్వర్యాన్ని, రాహువు
బాహుబలాన్ని, కేతువు కులాధిక్యతను కలుగచేస్తారని చెప్పబడినది.
శ్లోకం
శతాయు వజ్రదేహాయ సర్వసంపత్ కరాయచ
సర్వారిష్ట వినాశాయ నింబకం దళబక్షణం
ఉగాదినాడు ఈ శ్లోకమును చదివి ఉగాదిపచ్చడి ని తీసుకోవాలి.
'బ్రహ్మ ప్రళయం' పూర్తి అయిన తరువాత తిరిగి సృష్టి
ప్రారంభించుసమయాన్ని 'బ్రహ్మకల్పం' అంటారు. ఇలా ప్రతికల్పంలోను మొదటవచ్చే
యుగాదిని యుగానికి ఆదిగా, ప్రారంభసమయమును "ఉగాది" అని వ్యవహరిస్తూ ఉంటారు.
అలాగునే ఈ 'ఉగాది' పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభమవడం వల్ల ఆరోజు నుండి
మన తెలుగు సంవత్సర ఆరంభ దినంగా పరిగణించి, లెక్కించుటకు వీలుగా ఉండేందుకే
ఉగాది పండుగను మనకు ఋషిపుంగవులు ఏర్పాటు చేశారు.
లక్ష్మీప్రాప్తికి, విజయసాధనకు చైతన్యం కావాలి. జీవునకు
చైతన్యం కలిగించేది కాలం. ముఖ్యంగా ఉగాది సమయం గంటలు, రోజులు, వారాలు,
పక్షాలు, నెలలు, ఋతువులు, ప్రాణులు కాలస్వరూపమైన సంవత్సరంలో
నివసిస్తున్నాయి.
తృట్యైనమః, నిమేషాయనమః, కాలాయనమః అంటూ ప్రకృతిని,
ప్రకృతికి కారణమైన శక్తిని ఆరాధిస్తాము. ఉగాదినాటి పంచాంగం పూజ, పంచాంగం
పూజ, పంచాంగం శ్రవణం కాలస్వరూపనామార్చనకు ప్రతీకం. పంచాంగ పూజ, దేవి పూజ
సదృశమైంది. అంతం, ముసలితనం, మరణం లేనిది కాలస్వరూపం. అదే దేవి స్వరూపం.
అందుకే పంచాంగం పూజ, పంచాంగ శ్రవణం, దేవి పూజ ఫలాన్ని ప్రసాదిస్తుంది.
విక్రమార్కుడు పట్టాభిషిక్తుడైన శుభదినం చైత్రశుద్ధపాడ్యమి. ఆనాడే
విక్రమార్క శకం ప్రారంభమైంది.
శకులపై శాలివాహనులు సాధించిన ఘన విజయం ఉగాది పచ్చడిలోని
తీపికి, యుద్ధంలో కలిగిన కష్టనష్టాలు చేదుకు, శత్రువులను తమలో ఒకరుగా
కలుపుకోవడంలో వచ్చిన మంచి చెడ్డలు పులుపునకు చిహ్నంగా మన పూర్వీకులు
భావించి స్వీకరించారు. ఈ మూడింటి కలయికకు గుర్తుగా ఆనవాలుగా
విక్రమాదిత్యుని కాలంలో శాలివాహన శకారంభం నుండి ఉగాది పచ్చడి ఆస్వాదించడం
ఆచారమైందని చారిత్రకుల నిర్ణయం.
ఈ పండగ ప్రత్యేకత 'ఉగాది పచ్చడి'.
ఈ పచ్చడిలో చేరే పదార్ధాలలో వేప పువ్వు ముఖ్యమైనది. బెల్లం, కొత్త
చింతపండు పులుసు, మామిడి ముక్కలు, కొన్ని ప్రాంతాలలో అరటిపళ్ళ గుజ్జు కూడా
చేర్చి పచ్చడిగా తయారుచేస్తారు. తీపి, ఉప్పు, పులుపు, చేదు, వగరు, కారం
అనే షడ్రుచుల సమ్మేళనంగా జీవితంలో కష్టసుఖాలు ఆనంద విషాదాలుగా కలగలిసి
ఉంటాయని చెప్పడానికి ప్రతీకగా దీన్ని అందరూ సేవిస్తారు. ఆరోగ్యానికి ఇది
మంచిది. అంతేకాకుండా అంతర్గతంగా ఆరోగ్య సూత్రం ఇమిడి ఉందని తెలుపుతోంది.
మామిడాకుల తోరణాలు కట్టడం, తలస్నానం చెయ్యడం, కొత్తబట్టలు
ధరించడం, పిండి వంటలు చేయడం పూర్వం నుంచీ వస్తున్న ఆచారం. ఆదాయ వ్యయాలు,
రాజ పూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం
ఆనవాయితి. పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద అంతా చేరి,
పురోహితుడిని రప్పించి, తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది?
గ్రహణాలు ఏమైనా ఉన్నాయా? ఏరువాక ఎప్పుడు సాగాలి? వంటివన్నీ అడిగి
తెలుసుకుంటారు.
మనకు తెలుగు సంవత్సరాలు 'ప్రభవ'తో మొదలుపెట్టి 'అక్షయ'నామ
సంవత్సరము వరకు గల 60సంవత్సరములలో మానవులు తాము జన్మించిన నామ
సంవత్సరాన్ని వారి జన్మాంతర సుకృతాలనుబట్టి జీవితంలో ఒక్కసారో, రెండుసార్లో
చస్తూంటారు! అందువల్లనే వారు జన్మించిన 60 సంవత్సరములకు తిరిగి ఆ నామ
సంవత్సరం వచ్చినపుడు, అది ఒక పర్వదినంగా భావించి 'షష్టిపూర్తి' ఉత్సవాన్ని
వైభవంగా చేసుకుంటూ ఉంటారు.
పంచాంగ శ్రవణం
నిత్య వ్యవహారాల కోసం ఈనాడు అందరూ ఇంగ్లీషు
క్యాలెండర్ అయిన "గ్రిగేరియన్ క్యాలెండరు"ను ఉపయోగిస్తూ
వున్నా...శుభకార్యాలు, పూజా పునస్కారాలు, పితృదేవతారాధన, వంటి విషయాలకు
వచ్చేటప్పటికి
"పంచాంగము" ను ఉపయోగించడం మన పంచాంగ విశిష్టతకు నిదర్శనం. ఈ
పంచాంగం ఉగాదితో అమల్లోకి వచ్చి, మళ్ళీ సంవత్సరం ఉగాది ముందురోజు వరకు
అమలులో ఉంటుంది. అటువంటి పంచాంగమును ఉగాదినాడు వివిధ దేవతలతోపాటు
పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాకుండా 'పంచాంగ శ్రవణం' ఉగాధి
విధుల్లో ఒకటి. ఈనాడు గ్రామాలు మొదలుకొని పెద్ద పెద్ద నగరాల వరకూ
అన్నిచోట్లా పంచాంగ శ్రవణం నిర్వహించడం చూస్తూనే ఉన్నాము. కాగా ప్రస్తుతం
పంచాంగాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఇలా పూర్వం లభించేవికాదు. తాటాకుల
మీద వ్రాయబడేవి కనుక పండితులవద్ద మాత్రమే ఉండేవి. కనుక వారు ఉగాదినాడు
సంవత్సర ఫలాలను అందరికీ తెలియజేస్తారు.
ఈ విధముగా పంచాంగ శ్రవణం ఆచారమైనట్లు పండితుల అభిప్రాయం."పంచాంగం" అంటే అయిదు అంగములు అని అర్ధం. తిధి, వారం, నక్షత్రం, యోగం, కరణం
అనేవి ఆ అయిదు అంగాలు. పాడ్యమి మొదలుకొని 15 తిధులు, 7వారాలు, అశ్వని
మొదలుకొని రేవతి వరకు 27 నక్షత్రములు, విష్కభం మొదలుకొని వైధృతి వరకు 27
యోగములు, బవ మొదలుకొని కింస్తుఘ్నం వరకు, 11 కరణములు వున్నాయి. వీటన్నిటినీ
తెలిపేదే "పంచాంగం". పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చుని
పంచాంగం వింటే మంచిదని పండితుల అభిప్రాయం. పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ
సంవత్సర ఫలితాలను వివరిస్తారు. అంటే నవనాయకులను తెలుసుకుని వారిద్వారా
ఫలాలను అంచనా వేస్తారు. సంవత్సరంలో ఏ ఏ గ్రహాలకు ఏ ఏ అధికారం లభిస్తుందో
తెలుసుకుంటారు. ఆ గ్రహాలే ఆ సంవత్సర నవ నాయకులు. వీరికి లభించే అధికారాన్ని
బట్టి ఆ సంవత్సర ఫలితాలు ఉంటాయి
-:సర్వేజనా సుఖినోభవంతు:-
No comments:
Post a Comment